DHARANI @ NIC | స్వదేశీ చేతుల్లోకి ధరణి
DHARANI @ NIC | స్వదేశీ చేతుల్లోకి ధరణి
ఇంతకాలం విదేశీయుల చేతుల్లోనే ధరణి పోర్టల్
ఎన్.ఐ.సి (NIC)కి ధరణి బాధ్యతలు
ఉత్వర్వులు జారీ చేసిన సర్కారు
ధరణి సమస్యల కు పూర్తిగా మిముక్తి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
HYDERABAD : రాష్ట్ర భూములకు సంబంధించి.. ఇప్పటి వరకు విదేశీ సంస్ధ అయిన టెర్రాసిస్ చేతిలో ఉన్న ధరణి నిర్వహణ బాధ్యత ఇక నుంచి స్వదేశీ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 1నుంచి తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణా బాధ్యతను జాతీయ సమాచార సంస్ధ (NATIONAL INFORMATION CENTRE -NIC) నిర్వహిస్తుందని, ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసినట్లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ధరణి సమస్యల నుంచి ప్రజలకు పూర్తి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్దలు ఎలాంటి ముందు చూపు లేకుండా హడావుడిగా, తొందరపాటు నిర్ణయాలతో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్ర రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తెలంగాణకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఒరిస్సా రాష్ట్రంలో ఈ సంస్ధ పనిచేసి విఫలమైందని, అటువంటి సంస్ధకు కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పెద్దలు కట్టబెట్టినట్లు మంత్రి పొంగులేటి విమర్శించారు. లక్షలాది రైతులకు చెందిన కోట్లాది ఎకరాల వ్యవసాయ భూములను, లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంతో పాటు రెవెన్యూ శాఖ చూసిన కేసీఆర్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఏకపక్షంగా, యదేచ్చగా విదేశీ కంపెనీలకు అప్పగించగా ఐదేళ్లపాటు ధరణి పోర్టల్ రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని దుయ్యబట్టారు.
*గత ఎన్నికల సమయంలో హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ విదేశీ కంపెనీల చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటుందని కాంగ్రెస్ చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఫలితంగా 71, 00,000 ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లయిందని అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఎన్నికల ప్రణాళికలో ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడతామని ప్రకటించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నామని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న తెలంగాణ భూములను కాపాడుకోవడానికి , ఆ కంపెనీ రద్దుకు నిర్ణయించామని పేర్కొన్నారు. ధరణి నిర్వహణ బాధ్యతను మార్చడం వలన రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడతాయని, అందరి భూ సమస్యలకు చక్కని పరిష్కారాలు త్వరలో లభిస్తాయని స్పష్టం చేశారు.
*గత 2020 అక్టోబర్ లో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ దారితప్పి లోపభూయిష్టంగా మారి ప్రజానీకానికి శాపంగా మారిందన్నారు. ధరణి పేరుతో జరిగినా దగా వల్ల తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయిందని, ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సమాధి చేసిందని తీవ్రంగా ఆరోపించారు. ఆ నాటి ప్రభుత్వ పెద్దల దాష్టీకానికి ప్రజలు అనుభవించిన బాధలు అన్నీ ఇన్నీకావని, కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి చరమగీతం పాడుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
* * *
Leave A Comment